Letter to Jilukara SRinivas - On Hindi and Sanskrit

మిత్రమా జిలుకర శ్రీనివాస్!

విజయవాడ

03-03-2025 

 


మిత్రమా జిలుకర శ్రీనివాస్!

సామాజిక ఉద్యమ అభివందనలతో, 

 

నువ్వు బాగున్నావని ఆశిస్తాను. 

నేను మొత్తమ్మీద బాగున్నాను. 

 

            నాకు ఓ ఇరవైయేళ్ళుగా జీవనశైలి రోగాలని అందంగా పిలుచుకునే డయాబెటీస్ వుంది. దాన్ని గుర్తు పట్టే సమయానికే రెటినోపతి వచ్చేసింది. కొండల్లో అతిగా తిరిగి హిప్ జాయింట్స్ రీ-ప్లేస్మెంటుకు వచ్చాయి. ఆరోగ్యాన్ని  జాగ్రత్తగా  మెనేజ్ చేస్తున్నాను. 

            నువ్వు క్రమంగా యాక్టివ్ పొలిటిషియన్ గా మారుతున్నట్టున్నావు. మంచిది. సంఘపరివారం తన సోషల్ బేస్ ను బాగా విస్తరించుకుంది. గతంలోలా అగ్రవర్ణాలు, ఓసి సామాజికవర్గాలకే అది పరిమితమైలేదు. ఎన్నికల్లో గెలవడానికీ, కాల్బలంగా ఉపయోగించుకోవడానికి దానికిప్పుడు బహుజన సామాజికవర్గాలు కావాలి.  బిసిలు, ఎస్సీలు, ఎస్టీలను తనవైపుకు చాలా వేగంగా లాక్కుంటున్నది. రిపబ్లికన్ పార్టి ఆఫ్ ఇండియా చీలికల్లో ఒకటి ఇప్పుడు ఎన్డీయేలో భాగస్వామిగా వుంటున్నది. దాని నాయకుడు రామదాస్ అథవాలే గత మూడు కేబినెట్ కూర్పుల్లొనూ ‘సామాజిక న్యాయం, సాధికారత’ విభాగాలకు సహాయ మంత్రిగా వుంటున్నారు. ఈ నేపథ్యంలో నీలాంటి సాంప్రదాయ అంబేడ్కరిస్టులు సమాజానికి చాలా అవసరం.  

            ఇప్పుడు నీకు ఉత్తరం రాయడానికి ఒక కారణం వుంది. నువ్వు తమిళనాడుకు చెందిన VCK  పార్టిలో కొనగుతున్నావు. అందరికీ తెలిసిన అంబేడ్కరిస్టువి. పైగా, “VCK stand by the Thalapathi Stalin sir” అని ఫిబ్రవరి 28న ఫేస్ బుక్ లో ఒక పోస్టు కూడ పెట్టావు. 

            దేశంలో హిందీ భాష మీద ఒక వివాదం తలెత్తిందని నీకు తెలుసు. హిందీని జాతీయ భాషగా మార్చి, దక్షణాది మీద ఉత్తరాది రాష్ట్రాల ఆధిపత్యాన్ని స్థాపించాలని బిజెపి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇది సమాఖ్య స్పూర్తికి విరుధ్ధం.  

            ఉత్తరాది దక్షనాది ప్రాంతాల మధ్య జనాభా అంశం కూడ వివాదంగా మారబోతున్నది. రేపు డీ-లిమిటేషన్ తో నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ జరిగితే లోక్ సభలో ఉత్తరాది సీట్లు మరింతగా  పెరిగిపోతాయి. అప్పుడు దక్షణాది ప్రజల మద్దతు లేకపోయినా సరే కేవలం ఉత్తరాది ప్రజల మద్దతుతోనే  కేంద్రంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవచ్చు.  

            ఆ తరువాత ఏం జరుగుతుందనేది ఊహించుకోవచ్చు.  

            భాషలన్నీ సమానమే అంటున్న ప్రధాని మోదీజీ ‘హిందీ మరింత సమానం’ అంటున్నారు.  

            కేంద్ర ప్రభుత్వ చర్యల్ని సహజంగానే దక్షణాది రాష్ట్రాలు వ్యతిరేకించాలి. కానీ, అలా జరగడంలేదు. ఏవో కూటమి ఆబ్లిగేషన్స్  వుంటాయిగా?. ఒక్క తమిళనాడులోనే కొంత నిరసన వ్యక్తం అవుతోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ హిందీ వ్యతిరేక ఉద్యమానికి సిధ్ధం అవుతున్నారు.   

             హిందీ వివాదం మీద అధ్యయనం చేస్తున్న క్రమంలో రాజ్యాంగ సభ చర్చల్ని కూడ ఒకసారి చూడాలనిపించింది. 1949 సెప్టెంబరు రెండవ వారంలో ఈ అశం మీద చర్చ జరిగింది.  “If today, our people, instead of confining themselves to Hindi, had accepted Sanskrit as the national language, none would have contested it, because Sanskrit is the mother of all our languages.” అని అంబేడ్కర్ అన్నట్టుగా ఒక చోట చదివాను.  

            అప్పటి పరిస్థితుల్లో అంబేడ్కర్ ఇక్కడ సంస్కృతం చదువుకోవడానికి అవకాశాలు తక్కువ; దాదాపు లేవనే చెప్పాలి. ఆయన జర్మనీలోవున్న రోజుల్లో అక్కడ సంస్కృతం చదివాడని ఎక్కడో చదివాను. ఈ నేపథ్యంలో అంబేడ్కర్ సంస్కృతాన్నో దేవనాగరి లిపిలోని హిందీనో జాతీయభాషగా చేయమని అంటారని నేను అనుకోలేదు. అలాగే అంబేడ్కర్ ఫెడరల్ స్టేట్ కన్నా Unitary State మంచిదని భావించినట్టు ఇంకో వ్యాసంలో చదివాను.   కొంచెం ఆశ్చర్యం కూడ వేసింది.  

            ఇవి ఇప్పుడు నన్ను కొంచెం సంధిగ్ధంలో పడేస్తున్న  అంశాలు. నివృత్తి కోసం ఎవర్ని సంప్రదించాలి అనుకున్నప్పుడు నువ్వు గుర్తుకు వచ్చావు. అంబేడ్కర్ ను నువ్వు నాకన్నా  ఎక్కువగా చదివావని నా అభిప్రాయం. 

            రాష్ట్రాల అమరిక, జాతీయ భాషల మీద అంబేడ్కర్ అభిప్రాయాన్ని కొంచెం వివరించ గలవు. ఈ అంశాల మీద నా అవగాహనను పెంచుకోవడానికి నీ ఉత్తరం తోడ్పలగలదని ఆశిస్తాను. 

            నీ లేఖ కోసం ఎదురుచూస్తాను.  

నీ 

మిత్రుడు 

డానీ. 

    

Comments